గత వారం విడుదలైన ‘మహానటి’ చిత్రం కలెక్షన్ల పరంగా రోజు రోజుకీ ఊపందుకుంటోంది. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.
మొదటి నాలుగు రోజుల్లో రూ.2.6 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఆదివారం మంచి రన్ కనబర్చి 5 రోజులకుగాను రూ.3.47 కోట్ల షేర్ ను నమోదుచేసింది. ఈ వసూళ్లు ఇలాగే కొనసాగితే ఈ ఫుల్ రన్ ముగిసేనాటికి చిత్రం రూ.10 నుండి 12 కోట్ల వరకు వసూలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సావిత్రి పాత్ర ధరించిన కీర్తి సురేష్ కు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు అందుతున్నాయి. సావిత్రిగారికి ఘనమైన నివాళిగా పరిగణింపబడుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు సంయుక్తంగా నిర్మించారు.
