తెలుగు పరిశ్రమకు అప్పటికీ.. ఇప్పటికీ మకుటం లేని మహారాజు ఎవరయా అంటే అది మెగాస్టార్ చిరంజీవే. ఈ మాట చెప్పడానికి ఆయన మీద డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకున్న నమ్మకమే గొప్ప సాక్ష్యం. ‘బాహుబలి’ తెలుగు సినిమాకు ఒక బార్ సెట్ చేసి పెట్టినా మిగతా స్టార్ హీరోలంతా నాన్ బాహుబలి రికార్డులు అంటూ రూ. 100 – 150 కోట్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఆరు పదుల వయసు దాటిన చిరంజీవి మాత్రం ‘సైరా’తో దాదాపు రూ.250 కోట్ల టార్గెట్ పెట్టుకుని సై.. సైరా.. అంటూ బరిలోకి దూకుతున్నారు.
చిరు ఇంత సాహసం చేయడానికి, తండ్రి మీద రామ్ చరణ్ రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టడానికి ఏకైక కారణం ప్రేక్షకుల్లో చెక్కు చెదరని మెగాస్టార్ ఛరీష్మానే. కెరీర్లో ఎప్పటికప్పుడు తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ముందుకుసాగి శిఖరాగ్ర స్థాయిని అందుకున్న నిత్య శ్రామికుడు చిరు. ఆయన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు కథ ఏంటి, దర్శకుడు ఎవరు, బడ్జెట్ ఎంత అని ఆలోచించకుండా రైట్స్ కొనేవారు. చిరు సైతం అంత మార్కెట్ స్థాయి ఉన్నా ఏనాడూ హద్దులు దాటి హక్కుల్ని అమ్మడానికి ఒప్పుకునేవారు కాదు. చిరు సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళాక అప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒక వెలుగు వెలిగిన వారంతా పూర్తిగా ఆ వ్యాపారాన్ని వదిలేశారంటే అతిసయోక్తి కాదు.
ఇప్పుడు కూడా ‘సైరా’ హక్కుల్ని చరణ్ తండ్రి పేరు చెప్పి విపరీతమైన రేట్లకి అమ్ముకుని ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. న్యాయమైన ధరలకే అమ్మారు. చిత్ర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రకారం సినిమా రూ.300 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. దీన్ని మిగతా స్టార్ హీరోలు కష్టమైన టార్గెట్ అనుకుంటారేమోకానీ చిరు మాత్రం రఫ్ఫాడించేస్తా అంటున్నారు. ఏళ్ల తరబడి అనుభవం, మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉన్న డిస్ట్రిబ్యూటర్లు సైతం చిరు తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేధించగలరని ధీమాగా ఉన్నారు.
వారింత ధీమాగా ఉండటానికి కారణం ఏమిటయా అంటే మళ్లీ సేమ్ సమాధానం.. అదే మెగాస్టార్ చిరంజీవి. ఇన్ని దశాబ్దాల పాటు తన ప్రతి సినిమా ముందు కంచుకోటలా నిలబడి నమ్ముకున్న ప్రతిఒక్కరినీ విజయతీరాలకు చేరుస్తూ వచ్చిన చిరు ఈ సినిమా విషయంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందిస్తారని అంతా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు అయితే సినిమా విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.. అక్కడ ఉన్నది స్టార్ కాదు.. మెగాస్టార్ అంటూ ఈజీగా చెప్పేస్తున్నారు.
