దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. దీనితో బాలీవుడ్ ని కూడా కరోనా పట్టిపీడిస్తుంది. కొద్దిరోజుల క్రితం సింగర్ కనికా కపూర్ దీని బారిన పడి సుదీర్ఘ చికిత్స తరువాత కోలుకున్నారు. అనంతరం నిర్మాత కరీం మోరాని, ఆయన కూతుళ్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిర్మాత బోని కపూర్ ఇంట్లో సహాయకులకు కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా నటుడు కిరణ్ కుమార్ తనకు కరోనా సోకినట్టు వెల్లడించారు. దీంతో మే 14 నుంచి హోం క్వారంటైన్లో ఉంటున్నట్టు తెలిపారు. 74 ఏళ్ల కిరణ్ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు.. సీరియల్స్‌లో కూడా నటించారు. ఈ దీని గురించి ఆయన మాట్లాడుతూ…’వైరస్ లక్షణాలు లేకపోయినా, నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జ్వరం, దగ్గు వంటి రుగ్మతలు కూడా లేవు. అయినప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందుకే హోం క్వారంటైన్ అయ్యాను. కరోనా నిర్ధారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇంట్లోని రెండో ఫ్లోర్లో నా కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. నేను మూడో ఫ్లోర్లో ఒంటరిగా ఉంటున్నాను’ అన్నారు.