
సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హాళ్ల రీఓపెనింగ్ ఖాయమైపోయింది. ఈ నెల 15 నుండి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే కఠినమైన నిబంధనల నడుమ ఇకపై సినిమాలను వీక్షించాల్సి ఉంటుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈమేరకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
థియేటర్లోకి 50 శాతం నంది ప్రేక్షకులనే అనుమతించాలి. సీట్ల మధ్యలో భౌతిక దూరం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆల్టర్నేట్ సీట్లలోనే కూర్చోవాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ప్రేక్షకులకు శానిటైజర్లు, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచాలి. థియేటర్ల సముదాయంలో ఒక్కో స్క్రీన్ టైమ్ ఒక్కొక విధంగా ఉండాలి. ఒకేసారి అన్ని స్క్రీన్లలో షోలు వేయడం కుదరదు. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, బూట్లు అందుబాటులో ఉంచాలి. థియేటర్లో ఉష్ణోగ్రత 24 నుని 30 డిగ్రీల వరకు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. టికెట్ కౌంటర్లు రోజంతా తెరిచే ఉంచాలి, కౌంటర్ల సంఖ్య కూడ పెంచాలి. స్నాక్స్ కౌంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేసి భౌతిక దూరం కోసం మార్కింగ్స్ వేయాలి. చెల్లింపుల్లో ఆన్ లైన్ పద్దతి పాటించాలి. కోవిడ్ నిబంధనలు తెలిపే ప్రకటనలను ప్రసారం చేయాలి.
యాజమాన్యాలతో పాటు ప్రేక్షకులకు కూడ కొన్ని నియమాలను విడుదల చేశారు. కోవిడ్ లక్షణాలు లేనివారే సినిమా హాళ్లకు వెళ్ళాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా సిబ్బందికి తెలియజేయాలి. సరైన కాంటాక్ట్ వివరాలే ఇవ్వాలి. థియేటర్ పరిసరాల్లో ఉమ్మివేయడం నిషిద్ధం. విరామం సమయంలో, సినిమా వదిలాక గుంపులు గుంపులుగా వెళ్లకుండా దూరం పాటిస్తూ మెలగాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠినచర్యలు ఉంటాయి.