‘ఆర్ఆర్ఆర్’లో హెవీ యాక్షన్ సీన్.. 150 రోజుల ట్రైనింగ్

RRR2

రాజమౌళి సినిమా అంటేనే చెక్కిన శిల్పం అంటుంటారు. అందుకే ఆయనకు జక్కన్న అనే ట్యాగ్ తగిలించారు సినిమా జనం. ఒక కమర్షియల్ సినిమాలో ఏయే అంశాలు ఎంత శాతం ఉండాలో జక్కన్న సినిమా చూస్తే అర్థమైపోతుంది. కథ, కథనం, పాత్రల మీద ఎంత దృష్టి పెడతారో హీరో ఎలివేషన్ సన్నివేశాల మీద కూడ అంతే దృష్టి పెడతారు ఆయన. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టే ఆయన చిత్రాల్లో ఒళ్ళు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు ఉంటాయి. ‘ఛత్రపతి, మగధీర, సింహాద్రి, బాహుబలి’ ఇలా ఏ సినిమా చూసినా ఒక ట్రేడ్ మార్క్ ఫైట్ ఖచ్చితంగా ఉంటుంది.

ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడ అలాంటి ఫైట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒక కీలకమైన పోరాట సన్నివేశాన్ని రానున్న కొత్త షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఫైటర్లను తీసుకొచ్చారు. వారికి 150 రోజుల పాటు ట్రైనింగ్ సెట్ ఇస్తున్నారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సోలొమన్ రాజు వీరికి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని స్టంట్స్ డిజైన్ చేసి పెట్టారట. వాటిలో కొన్నింటిని రాజమౌళి ఫైనల్ చేసి ఒరిజినల్ లొకేషన్లో చిత్రీకరించనున్నారు. మామూలుగా అయితే లొకేషన్లోనే స్టంట్ రిహార్సల్స్ ఉంటాయి. కానీ ఇప్పటికే షూట్ ఆలస్యం కావడంతో ఆన్ లొకేషన్లో ప్రాక్టీస్ సెషన్స్ పెట్టకుండా సెట్లోకి వచ్చే ముందే ఫైటర్లను సంసిద్ధం చేస్తున్నారట.

ఈ భారీ యాక్షన్ సన్నివేశం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారు. సినిమాలో ఇదే భారీ ఫైట్ అని అంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సుమారు 400 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.

Exit mobile version