‘రాజావారు రాణివారు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. నైట్ బ్లైండ్నెస్ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రిస్మస్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కథానాయిక లావణ్యా త్రిపాఠి ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్ అబ్బవరాన్ని చూపించడం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.
జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఆయన సంగీతం అందిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సినిమా కథతో పాటు కొత్తగా ఏదైనా చేయాలని యూనిట్ సభ్యుల తాపత్రయం ఆయనకు నచ్చడంతో ఈ సినిమా అంగీకరించారు.
‘సెబాస్టియన్ పి.సి. 524’లో కిరణ్ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్ డ్రస్‌లో క్లీన్ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్ రోజున జన్మించిన క్రిస్టియన్ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
