‘కెజిఎఫ్’ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్షన్ ప్రియులను ఒక ఊపేసింది ఈ చిత్రం. ఈ విజయంతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్, హీరోగా యష్ పేరు దేశవ్యాప్తమైంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం ఈ స్థాయి యాక్షన్ సినిమాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ నీల్ అవకాశం ఇస్తే పార్ట్ 2లో నటిస్తామని కొందరు బహిరంగంగానే అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘కెజిఎఫ్ 2’లో పలు పరిశ్రమల నటీ నటులు ఉన్నారు.
బాలీవుడ్ నుండి రవీనా టాండన్, సంజయ్ దత్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే రవీనా టాండన్ ఈ చిత్రంలో అవకాశం దక్కించుకున్న తీరు కొంచెం చిత్రంగానే ఉంది. ‘కెజిఎఫ్ 2’ కోసం ప్రశాంత్ నీల్ అప్రోచ్ అయ్యేవరకు తాను ‘కెజిఎఫ్’ చూడలేదని చెప్పిన రవీనా టాండన్ ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశానని, సినిమాకు సైన్ చేసిన తర్వాత ‘కెజిఎఫ్’ చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారామె. రెండవ భాగంలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని కూడా అన్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ జనవరి 8న కథానాయకుడు యష్ పుట్టినరోజు సందర్బంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది.
