యంగ్ హీరో కార్తిక్ రాజు, ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి సహ నిర్మాతలు.
రామా నాయుడు స్టూడియోలో జరిగిన లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖులు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో సురేష్ బాబు క్లాప్ కొట్టగా, చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ, “ఇది 1980ల వరంగల్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ. హాస్యం, ఎమోషన్‌తో సాగుతుంది. కార్తిక్ రాజు, కాజల్ చౌదరి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పని చేయడం ఆనందంగా ఉంది,” అన్నారు.
హీరో కార్తిక్ రాజు, “80వ దశకంలో జరిగే కథతో వస్తున్న ఈ సినిమా నాకు ప్రత్యేకం. దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు,” అన్నారు. హీరోయిన్ కాజల్ చౌదరి, “ఇది యూనిక్ స్టోరీ. తెలుగు ప్రేక్షకుల ప్రేమతో మరో హిట్ అందుకుంటానని ఆశిస్తున్నాను,” అన్నారు.
