‘షష్టిపూర్తి’ కథను నమ్మాను.. అందుకే మ్యూజిక్ ఇచ్చాను – మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా

il

మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా ఓ సినిమాను ఒప్పుకుని సంగీతాన్ని అందించడమే ఓ గొప్ప విషయం. అలాంటి ఇసైజ్ఞాని ప్రస్తుతం ‘షష్టిపూర్తి’ సినిమాకు పని చేశారు. ఇక తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచిన ఇళయరాజా ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా చేస్తుండటం విశేషం. ‘షష్టిపూర్తి’ కోసం ఇళయరాజా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలుగా రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈక్రమంలోనే లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఇసైజ్ఞాని ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

చైతన్య ప్రసాద్ : ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చారు.. ఇంతటి స్థాయికి ఎదిగారు.. మీ ప్రయాణం, యాత్ర గురించి చెప్పండి?

ఇళయరాజా : నేను ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామంలో సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. మీరు నా ప్రయాణాన్ని యాత్ర అన్నారు. యాత్ర అంటే ప్రారంభ స్థలం ఉండాలి.. ఓ దారి ఉండాలి.. ఓ గమ్యస్థానం ఉండాలి. కానీ నాకు ప్రారంభం లేదు.. గమ్యస్థానం లేదు. అందుకని మీరు యాత్ర అని చెప్పొద్దు.

చైతన్య ప్రసాద్ : మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, పాటల్ని కంపోజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది?

ఇళయరాజా : మా అన్న గారు పాటలు పాడుతుంటే వాటికి మధ్యలో మ్యూజిక్ వాయించేవాడిని. అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుండేవారు. ఆ చప్పట్లు వింటుంటే నాకు అలా గర్వం పెరుగుతూ వచ్చేది. అయితే వాళ్లు చప్పట్లు కొట్టేది నేను వాయించినందుకా? ఆ సంగీతానికా? అని అనుకునేవాడిని. కచ్చితంగా సంగీతానికి చప్పట్లు కొడుతున్నారు. అంటే అది కంపోజ్ చేసిన ఎం‌ఎస్‌వి గారి కోసం చప్పట్లు కొడుతున్నారని అర్థమైంది. మనకు కూడా ఈ చప్పట్లు కావాలంటే.. మనం కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని అలా కంపోజింగ్ మీద దృష్టి సారించాను.

చైతన్య ప్రసాద్ : మీలాంటి వారు ఇలాంటి కొత్త టీం కోసం ముందుకు వచ్చారు. ‘షష్టిపూర్తి’లో మీకు నచ్చిన అంశం ఏంటి?

ఇళయరాజా : నా కెరీర్ ఆరంభం నుంచి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. భారతీరాజా, మణిరత్నం ఇలా అందరూ అప్పట్లో కొత్త వాళ్లే. నాతో సినిమాలు చేసిన తరువాత వారికి ఆ స్టార్డం, గుర్తింపు వచ్చింది. వాళ్లని వాళ్లు నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని ఒప్పుకున్నాను. ఇందులో మేం చేసిన పని ఎలా ఉంది? అనేది ఆడియెన్స్ చెప్పాలి. మంచి కథ ఉందా? లేదా? అన్నదే నేను చూస్తాను. స్టార్స్ ఉన్నారా? లేదా? అన్నది నేను పట్టించుకోను.

చైతన్య ప్రసాద్ : రాజా గారితో పని చేసిన అనుభవం మీ మాటల్లో చెప్పండి?

హీరో, నిర్మాత రూపేశ్ : రాజా గారి వద్దకు వెళ్తున్నామంటేనే చాలా భయంగా అనిపించింది. మా లాంటి కొత్త వారిని కూడా ఎంతో గొప్పగా ప్రేమించి సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం మా అదృష్టం. మా ఈ ‘షష్టిపూర్తి’ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను.

చైతన్య ప్రసాద్ : ‘షష్టిపూర్తి’ కూడా రాజా గారి స్టూడియోలోనే ప్రారంభమైంది కదా?

పవన్ ప్రభ : నాకు రాజా గారి స్టూడియో అంటే గుడి. అలాంటప్పుడు గుడిలోనే కదా నా సినిమాను ప్రారంభించాలి. నా సినిమాకు మ్యూజిక్ ఇస్తానని రాజా గారు వరం ఇచ్చారు.

చైతన్య ప్రసాద్ : రాజా గారి బాణీకి కీరవాణి గారితో పాట రాయించారు.. ఆ అనుభవం గురించి చెప్పండి?

పవన్ ప్రభ : ‘షష్టిపూర్తి’ చిత్రంలో ఓ క్లిష్టమైన సందర్భం ఉంటుంది. ఒకే సారి మంచి చెప్పాలి.. చెడు గురించి చెప్పాలి. అలాంటి ఓ సందర్భానికి కీరవాణి గారు పాట రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. రాజా గారు ఇచ్చిన బాణీని, ఆ స్థాయికి తగ్గట్టుగా రాయడం కీరవాణి గారి వల్ల సాధ్యం అవుతుందని నేను అనుకున్నాను. కీరవాణి గారు రాసిన పాటల్లో ‘కన్నా నిదురించరా’ అనే పాట నాకు చాలా ఇష్టం. నేను ఈ ‘షష్టిపూర్తి’ సినిమాలోని ప్రతీ రీల్‌ను రాజా గారితోనే చూశాను. ఆ అదృష్టం నాకే దక్కినట్టుంది.

చైతన్య ప్రసాద్ : ఒకే సారి మీరు పదుల చిత్రాలకు పని చేస్తుండేవారు? ఆ ఒత్తిడిని ఎలా భరించేవారు?

ఇళయరాజా : దీపావళి సీజన్ వస్తుందంటే డజన్ చిత్రాలు రిలీజ్ అవుతుండేవి. ఆ డజన్ చిత్రాలకి కూడా నేనే మ్యూజిక్ ఇస్తుండేవాడ్ని. ఇక రీ రికార్డింగ్, బీజీఎం పనులన్నీ కూడా మూడు రోజుల్లోనే పూర్తి చేసేవాడ్ని. అలా ఒకసారి మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకోసం మూడు స్టూడియోల్ని బుక్ చేశాను. మూడు టీంలను పెట్టుకుని ప్రాక్టీస్ చేయించాను. మూడు డిఫరెంట్ జానర్ చిత్రాలను.. మూడు రోజుల్లోనే ఫినిష్ చేశాను. ఇప్పటికీ ఆ మూడు సినిమాలు చూస్తే ఒక దాంట్లోని మ్యూజిక్ ఇంకో దాంట్లో కనిపించదు.

Exit mobile version