మహిళలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే, వారు కోరుకున్న లక్ష్యాలను సాధించగలరని బాలీవుడ్ నటి వామికా గబ్బి అన్నారు. దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వామికా గబ్బి మాట్లాడుతూ, “మిస్ ఇండియా యూకే వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రపంచానికి చాటవచ్చు. ఇలాంటి వేదికలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి,” అని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ నిర్వాహకులు స్టార్‌డస్ట్ పేజెంట్స్ ప్రతినిధులు సత్య, క్రాంతి, సాయి మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఈ ప్రాజెక్ట్ ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మిస్ తెలుగు యూకే, మిస్ తమిళ యూకే, మిస్ కన్నడ యూకే, మిస్ మలయాళం యూకే పోటీలు నిర్వహించబోతున్నాం,” అని వివరించారు.
ఈ పోటీల్లో పాల్గొనే మహిళలకు నగదు బహుమతులు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రమోషన్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఈ పేజెంట్‌లో అందాల పోటీలతో పాటు, దక్షిణ భారతీయుల సంప్రదాయాలను ప్రపంచ వేదికపై పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
