తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకాలపై వెంకటేష్ పెద్దపాలెం హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘వన్ బై ఫోర్’ (One/4). బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ మల్లిక్, హీనా సోని కథానాయికలు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్న సందర్భంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘టంగ్ స్లిప్’’ అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామాను రూపొందించామని, సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదని తెలిపారు. దర్శకుడు పళని టేకింగ్ రాజమౌళి గారి స్టైల్‌లో ఉంటుందని, సుభాష్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలమని పేర్కొన్నారు. వంద శాతం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.
దక్షిణాది సినిమాలపై, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాతలు రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ తెలిపారు. తమ కల నిజమవుతున్నట్లుగా ఉందని, సినిమా అద్భుతంగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్ 12న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
