సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై సాయి సింహాద్రి స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్, పాటలను ఘనంగా విడుదల చేసింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకులు సముద్ర, వి.ఎన్ ఆదిత్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను బట్టి సినిమాపై అంచనాలు ఏర్పడతాయని, ‘సన్ ఆఫ్’కి అది బాగా కుదిరిందని ప్రశంసించారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయం సాధిస్తే పరిశ్రమలోకి మరింత మంది కొత్తవారు వస్తారని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.
హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ.. నటనపై శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ సినిమా చేశానని, దర్శకుడు సతీష్ చెప్పిన కథ తనను బాగా ఆకట్టుకుందాని తెలిపారు. సినిమా చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఎమోషనల్ అవుతారని, కన్నీరు పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు రాలేరని నమ్మకం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్ శోభా రాణి మాట్లాడుతూ.. టైటిల్‌లోనే ఎమోషన్ ఉందని, కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల ఈ చిత్రానికి పాటలు అందించడమే కాక సంగీత దర్శకుడు రిషిని పరిచయం చేశారు.
