ఏమో ఏమో ఇది : వయొలెన్స్ నుంచి వాలెంటైన్స్.. శైలేష్ కొలను కొత్త ప్రయాణం..!

Emo Emo Idi

‘హిట్’, ‘హిట్ 2’, ‘సైంధవ్’, ‘హిట్ 3’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అయితే, వరుసగా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్లతో మెప్పించిన శైలేష్, ఈసారి తన రూటు మార్చి ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి ‘ఎమో ఎమో ఇది’ (Emo Emo Idi) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో రోషన్ మేక హీరోగా నటిస్తుండగా ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ గ్లింప్స్‌లో హీరో రోషన్ మరియు అతని తల్లి పాత్రలో నటించిన దేవదర్శిని మధ్య సాగే సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది. ‘‘చూడటానికి ఇంత బాగున్నావు కదా.. ఇంకా సింగిల్‌గా ఎందుకున్నావు?’’ అని తల్లి అడిగిన ప్రశ్నకు, హీరో నేటి కాలంలో మగాళ్లకు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో వివరిస్తాడు. ఇటీవల భార్యల చేతిలో భర్తలు దారుణంగా హత్యకు గురైన సంఘటనలను గుర్తు చేస్తూనే.. సిట్యుయేషన్‌షిప్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ వంటి మోడ్రన్ రిలేషన్‌షిప్ పదాల గురించి మాట్లాడటం యువతను ఆకట్టుకుంటుంది.

గ్లింప్స్ చివర్లో కాఫీ షాప్ నడుపుతున్న హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎంట్రీ ఇవ్వడం, ఇద్దరి మధ్య చూపులు కలవడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆహ్లాదకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ దృశ్యాలకు ప్రాణం పోసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ దసరా 2026 కానుకగా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version