తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్ర సెన్సార్ సర్టిఫికేషన్ ఆలస్యంపై నెలకొన్న వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. సెన్సార్ ప్రక్రియ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని, నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.
నిజానికి ఈ సినిమా జనవరి 9నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఇది కేవలం సెన్సార్ బోర్డు అంతర్గత ప్రక్రియ అని, ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. తాను అధికార కూటమిలో భాగమైనప్పటికీ, తన ‘OG’ సినిమాలో ఉన్న వాయిలెన్స్ కారణంగా బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనలు ఎవరి కోసం మారవని, అధికారంలో ఉన్నవారికి కూడా అవి వర్తిస్తాయని ఆయన వివరించారు.
సెన్సార్ వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లడంపై కూడా పవన్ తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి విషయం న్యాయస్థానానికి వెళ్తే, దాని ఫలితం మన చేతుల్లో ఉండదని ఆయన హెచ్చరించారు. ‘జన నాయగన్’ చిత్ర బృందం ఈ సమస్యను సెన్సార్ బోర్డు పరిధిలోనే పరిష్కరించుకోవాల్సిందని సూచించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన మమిత బైజు నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
