తమిళంలో ఘన విజయం సాధించిన ‘యూత్’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈ నెల 26న భారీ ఎత్తున విడుదల కానుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు శ్రీవిష్ణు, సత్యదేవ్, దర్శకులు సాయి రాజేష్, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కెన్ కరుణాస్, అనిష్మ, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘కెన్ అండ్ గ్యాంగ్’ దర్శకత్వం వహించారు. ఈ2సీ (ఇంజనీరింగ్ టు సినిమా) బ్యానర్‌పై హౌస్‌ఫుల్ వినీత్, సందీప్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తమిళంలో కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 30 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, తెలుగులోనూ అదే స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ రంగం నుంచి నిర్మాతలుగా మారిన వినీత్, సందీప్‌ల కృషిని కొనియాడారు. కేవలం నెల రోజుల్లోనే ఎంతో క్వాలిటీతో డబ్బింగ్ పనులు పూర్తి చేసి సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అభినందనీయమని శ్రీవిష్ణు ప్రశంసించారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయవచ్చని హీరో, దర్శకుడు కెన్ అన్నారు.
