యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్‌లో మేకర్స్ ఒక సరికొత్త ‘పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్’ మోడల్‌ను అనుసరించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం.. థియేటర్లలో ఈ సినిమా సాధించే నెట్ కలెక్షన్లలో 50 శాతం మొత్తాన్ని నెట్‌ఫ్లిక్స్ చెల్లించనుంది. అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా పెర్ఫార్మెన్స్ను బట్టే ఓటీటీ రేటు ఖరారవుతుందన్నమాట.
పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
