Save The Tigers Season 3: టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. ఈసారి దేవుడే దిగివచ్చాడండోయ్!

ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ మళ్లీ వచ్చేస్తోంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఇప్పటికే రెండు సీజన్ల పాటు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు మూడో సీజన్‌తో జియో హాట్‌స్టార్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. “వాళ్లు దేవుడి ప్లాన్‌ను నమ్మారు.. కానీ దేవుడే స్క్రిప్ట్‌ను మార్చేస్తే ఎలా ఉంటుంది?” అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ముచ్చటగా మూడోసారి.. ఫన్ ట్రిపుల్ డోస్

గత రెండు సీజన్ల కంటే ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ గట్టిగానే పెంచారని పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మూడో సీజన్‌లో ఫన్, కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్.. ఈ మూడు కూడా మూడు రెట్లు (3X) ఎక్కువగా ఉంటాయని టీమ్ ప్రకటించింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమదైన టైమింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. వీరికి జంటగా పావని గంగిరెడ్డి, సుజాత, దేవయాని ఎప్పట్లాగే తమ పాత్రల్లో ఒదిగిపోనున్నారు.

అయితే, ఈసారి కథలోకి దేవుడి ఎంట్రీ ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ దేవుడి గెటప్‌లో కనిపిస్తుండటంతో.. మన టైగర్స్‌తో ఈయన ఆడుకోబోయే ఆట ఎలా ఉండబోతోందోనన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌లో పెరిగింది. వీరికి తోడు గంగవ్వ, సీరత్ కపూర్ లాంటి కొత్త తారాగణం ఈ సీజన్‌లో అదనపు ఆకర్షణగా నిలవనున్నారు.

పాత రికార్డులు.. కొత్త అంచనాలు

మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఎటువంటి అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను స్క్రీన్‌కు కట్టిపడేసింది. మొదటి సీజన్ ఊహించని విజయం సాధించగా, రెండో సీజన్ కూడా అదే స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ముఖ్యంగా గంటా రవి, రాహుల్, విక్రమ్.. ఈ ముగ్గురు పడే కష్టాలు ప్రతి ఇంట్లో జరిగేవే కావడంతో సగటు ప్రేక్షకుడికి కనెక్టివిటీ బాగా కుదిరింది.

ఇప్పుడు జియో, హాట్‌స్టార్ కలయిక తర్వాత వస్తున్న ఈ మూడో సీజన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా, ఈ మూడు పులులు తమ భార్యల చేతిలో పడే పాట్లు, అందులో నుంచి పుట్టే వినోదం కోసం ఓటీటీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దేవుడు రాసిన ఆ కొత్త స్క్రిప్ట్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version