ఇంటర్వ్యూ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ రైడ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 6న తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండగా, ప్రీబుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నాడు.

‘కొరియన్ కనకరాజు’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?

ఇందులోని అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ నన్ను బాగా ఆకట్టుకుంది. గాంధీ కథ చెప్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. వరుసగా సీరియస్, యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత, ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు రిలాక్స్ అయి నవ్వుకునే ఒక మంచి వినోదాత్మక చిత్రం చేయాలనే ఉద్దేశంతోనే ‘కొరియన్ కనకరాజు’ చేశాను.

సత్యతో మీ కాంబినేషన్ గురించి?

సత్యతో ఇది నాకు మూడో సినిమా. తను కేవలం కమెడియన్ మాత్రమే కాదు, మంచి నటుడు. సినిమాలో మా పాత్రలు బాగా పండటానికి రాయలసీమ యాస, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా హోమ్‌వర్క్ చేశాం. మా కాంబినేషన్, కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.

రెండు విభిన్న పాత్రలు చేయడం ఎలా అనిపించింది?

ఒక నటుడిగా రెండు వేర్వేరు బాడీ లాంగ్వేజ్‌లు, మనస్తత్వాలు చూపించడం చాలా ఛాలెంజింగ్‌గానూ, తృప్తిగానూ అనిపించింది. దర్శకుడు గాంధీ రాయలసీమకు చెందినవాడు కావడంతో ఆయనకు ఆ యాసపై పట్టుంది. కానీ నాకు కొత్త కాబట్టి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసి నటించాను.

కొరియన్ గెటప్ కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?

కొరియన్ స్టైల్ కోసం మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను. మనకి ఆ హెయిర్‌స్టైల్ కాస్త వింతగా అనిపించినా, కొరియాలో షూటింగ్ టైమ్‌లో సరిగ్గా అలాంటి లుక్‌తో ఉన్నవాళ్లనే చాలామందిని చూశాను.

ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఎలా అనిపించింది?

గాంధీ ముందే చెప్పినట్లు ‘F2’, ‘F3’తో పోలిస్తే ఇందులో నా పాత్ర ముమ్మాటికీ భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. తెరపై వరుణ్ తేజ్ కాకుండా కేవలం ‘కనకరాజు’ మాత్రమే కనిపించేలా, నన్ను ఆ పేరుతో పిలిచేలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను.

నిర్మాతల గురించి?

కంచె, అంతరిక్షం తర్వాత వాళ్లతో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. రాజీవ్ గారు, వంశీ గారు చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన పూర్తి సపోర్ట్ ఇచ్చారు.

తమన్ మ్యూజిక్ గురించి?

పెనుగొండ మాస్ క్యారెక్టర్ కొరియన్ కల్చర్‌లోకి మారే ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మ్యూజిక్‌లో చూపించడం పెద్ద ఛాలెంజ్ అని తమన్ చెప్పారు. ఆయన ఇచ్చిన ఆర్‌ఆర్‌ అద్భుతంగా వచ్చింది, థియేటర్‌లో గ్రాండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది.

ప్రేక్షకులకు ఏం చెబుతారు? ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు?

‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్‌టైనర్. కడుపుబ్బా నవ్వించే సినిమా. చాలా టైట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది.

Exit mobile version