వయసు ఎనిమిది పదులు దాటినా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎనర్జీ, వృత్తిపట్ల ఆయనకున్న కమిట్మెంట్ కొంచెమైనా తగ్గలేదు. తాజాగా ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ (KBC 18) షూటింగ్ కోసం ఏకంగా 24 గంటల పాటు నాన్-స్టాప్‌గా వర్క్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన అధికారిక బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
మొదటి రోజు ఉదయం 7 గంటలకు షూట్ ప్రారంభించగా, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా పని చేసినట్లు బిగ్ బీ తెలిపారు. KBC 18 టెలికాస్ట్ ప్రసార తేదీలు దగ్గర పడుతుండటంతో, నిర్దేశిత సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని భావించే ఈ సుదీర్ఘ షిఫ్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
లేట్ అయితే వేరొకరిని పెడతారు!
ఆగస్టు 10 నుంచి KBC 18 ప్రసారం కానుండటంతో షెడ్యూల్ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అమితాబ్ స్పష్టం చేశారు. “టీవీలో ప్రసారమయ్యే మొదటి తేదీ ప్రకటన వచ్చేసింది. ఈ సమయంలో నేను అందుబాటులో లేకపోతే లేదా ఆలస్యం చేస్తే నా స్థానంలో వేరొకరిని రీప్లేస్ చేస్తారు. అందుకే చేయాల్సిన పనిని త్వరితగతిన పూర్తి చేశాను” అంటూ బిగ్ బీ సరదాగా కామెంట్ చేశారు.
2000వ సంవత్సరంలో ప్రారంభమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోను అమితాబ్ బచ్చన్ దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు (మూడో సీజన్‌కు మాత్రమే షారుఖ్ ఖాన్ హోస్టింగ్ చేశారు). ఆరోగ్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, 83 ఏళ్ల వయసులో కూడా ఆయన చూపిస్తున్న వృత్తిపరమైన నిబద్ధతను, డెడికేషన్‌ను చూసి అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
