అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!

Ram-Pothineni

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల శశిభవ్యత ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎనలేని అభిమానం. ఆమెకు అన్నం తినిపించాలన్నా, మందులు వేయాలన్నా రామ్ ఫొటోలు, వీడియోలు చూపించాల్సిందే.

ఈ విచిత్రమైన, ఎమోషనల్ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది హీరో రామ్ దృష్టికి వెళ్లింది. తన అభిమాని పరిస్థితిని చూసి చలించిపోయిన రామ్ వెంటనే స్పందించి, ఆ బాలికతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. శశిభవ్యత తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఆమె వైద్యానికి అయ్యే మందుల ఖర్చులు, ఇతర అవసరాలన్నీ ఇకపై తానే భరిస్తానని భరోసానిచ్చారు.

మెరుగైన వైద్యం అందించేందుకు ఆమె మెడికల్ రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన అభిమానులకు, మీడియాకు రామ్ ధన్యవాదాలు తెలపగా, ఆయన చూపిన మానవత్వంపై శశిభవ్యత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version