యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’ రిలీజ్ డేట్ ఖరారు.. అక్టోబర్ 16న విడుదల

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ఫాంటసీ కామెడీ చిత్రం ‘నయ్యి నవెల్లి’ విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ (Amazon MGM Studios), కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

​బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ సంయుక్తంగా కథ అందించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

​కథాంశం ఏమిటంటే?

మీరట్‌కు చెందిన ఒక కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలిని చూసి, ఆమె ఒక మాంత్రికురాలేమోనని మరిది అనుమానించడం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ అనుమానం నేపథ్యంలో ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా పరిణామాలే ప్రధాన కథాంశమని చిత్రబృందం పేర్కొంది.

​కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలు పుష్కలంగా ఉండటంతోనే ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ప్రతినిధి నిఖిల్ మధోక్, నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ వెల్లడించారు.

Exit mobile version