టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, యువ నటుడు అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ అఖిల్ పెట్టిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.
‘హ్యాపీ బర్త్‌డే మై ముఫాసా’
ఇన్‌స్టాగ్రామ్‌లో నాగార్జునతో కలిసి దిగిన స్పెషల్ ఫొటోను షేర్ చేసిన అఖిల్.. “హ్యాపీ బర్త్‌డే మై ముఫాసా. మా కోసం మీరు చేసే ప్రతిదానికీ, మాపై చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు లేకుండా మాకు ఏదీ సాధ్యం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా నాకు మంచి తండ్రిగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ నాన్న.. ఎప్పుడూ సంతోషంగా ఉండండి” అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫొటోలో నాగార్జున కూర్చొని ఉండగా, అఖిల్ ఆయన్ను ప్రేమగా వెనుక నుంచి హత్తుకొని కనిపించారు. ‘లయన్ కింగ్’ సినిమాలోని బలమైన తండ్రి పాత్ర ‘ముఫాసా’తో నాగార్జునను పోలుస్తూ అఖిల్ విషెస్ చెప్పడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
