ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 30 ఆగస్టు, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 3/5
నటీనటులు : ఆకాంక్ష, పవన్ సింగులూరి, మీనా వాసు, శరణ్య, నళినీ దేవి
దర్శకత్వం : రామారావు సిరిపురం
నిర్మాణం : వెంకట్ తలారి
సంగీతం : సాయి కార్తీక్
ఛాయాగ్రహణం : చందు క్రిష్
కూర్పు : బాలాజీ వి బి జే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు ఓటిటి యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నందిని’. ఇక ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ కి చెందిన ఇద్దరు యువతీ యువకులు శివ (పవన్ సింగళూరి), నందిని (ఆకాంక్ష) లు పెళ్లి చూపులతో ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. కానీ ఈ పెళ్లి చూపుల్లో నందిని తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ ఇష్టం లేదని శివనే పెద్దలకి చెప్పమంటుంది. అక్కడ సీన్ కట్ చేస్తే శివ తనకి ఇష్టమే అని చెప్పి ఆమెకి షాకిస్తాడు. ఇక దీనితో కంగుతిన్న నందిని, శివతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అసలు ఆమె ఎందుకు పెళ్లి వద్దంటుంది? ఆమెకి ఉన్న సమస్య ఏంటి? దాన్ని శివ ఎలా పరిష్కారించి ఆమెని తన సొంతం చేసుకున్నాడా లేదా అనేది ఇందులో మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ నుంచి ఈ తరహా రోమ్ కామ్ లఘు చిత్రమైతే రాలేదు. ముఖ్యంగా లీడ్ జంట పవన్, ఆకాంక్షల నడుమ లవ్ ట్రాక్ ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. ఏ వ్యక్తి అయినా తమకి ప్రియమైన వారి కోసం ఎంతవరకు నిలబడతారు అనే పాయింట్ ని డీసెంట్ గా హ్యాండిల్ చేశారు.
ఇక వారిద్దరి నడుమ మొదటి కొంత సేపు కథనం డీసెంట్ ఫన్ మూమెంట్స్ తో సాగడం బాగుంది. ఇక నటీనటులుగా పవన్ సింగళూరి, ఆకాంక్ష ఇద్దరూ తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇరువురి నడుమ ట్రాక్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ లు కూడా డీసెంట్ గా అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు. అలానే చివరి కొన్ని నిమిషాల ఎమోషనల్ కథనం కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఇందులో కథనం దాదాపు ఓకే కానీ హీరోయిన్ కి సంబంధించి బ్యాక్ స్టోరీ మాత్రం ఇంకా బలంగా డిజైన్ చేసుకోవాల్సింది. ఆమెకి ఉన్న పర్శనల్ సమస్యని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ కి అంత పొంతన కనిపించదు.
ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియని వయసులో ఆమెకి జరిగిన ఓ సంఘటన నుంచి ఆమె పెళ్లీడుకి వచ్చినప్పటికీ మూవ్ ఆన్ కాలేదు అనే పాయింట్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. అలానే ఈ లఘు చిత్రం ఫ్లోలో పాటలు డిస్టబెన్స్ గా అనిపిస్తాయి. అంత లెంగ్త్ లేకుండా తక్కువ నిడివితో కట్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా కనిపించాయి. ఇది షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ నిర్మాత వెంకట్ తలారి బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, వెండితెర స్థాయి క్వాలిటీతో చాలా రిచ్‌గా నిర్మించారు. అలాగే టెక్నీకల్ గా కూడా బాగానే తీశారు. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్. కానీ ఎడిటింగ్ గా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు రామారావు సిరిపురం విషయానికి వస్తే.. తన వర్క్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. చాలా తక్కువమంది మహిళల్లో ఉండే లోతైన సమస్యపై తాను ఓ పాయింట్ తీసుకున్నారు. కాకపోతే దీనికి చూపించిన కారణం మాత్రం అంత లాజిక్ గా బలంగా కనిపించదు. ఇది పక్కన పెడితే తన మిగతా ట్రీట్మెంట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ లఘు చిత్రం ‘నందిని’ ఈటీవీ విన్ కథా సుధ నుంచి ఓ రిఫ్రెషింగ్ గా అనిపించే డీసెంట్ రోమ్ కామ్ అటెంప్ట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా లీడ్ జంట కెమిస్ట్రీ, వారి పెర్ఫార్మన్స్ లు అలాగే ఎమోషన్స్, లవ్ ట్రాక్ ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో హీరోయిన్ కి ఉన్న సమస్యను ఇంకొంచెం బెటర్ వెర్షన్ లో ట్రై చేయాల్సింది. జస్ట్ ఇది పక్కన పెడితే ఈ లఘు చిత్రం ఈటీవీ విన్ లో మెప్పిస్తుంది. వాచ్ ఇట్.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
