మార్వెల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: మళ్లీ థియేటర్లలోకి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’.. స్పెషల్ అప్‌డేట్‌తో!

మార్వెల్ సినీ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ పేరుతో రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.

​ఈసారి ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. IMAX, ఇన్ఫినిటీ విషన్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పెద్ద స్క్రీన్లు, మెరుగైన విజువల్స్, అద్భుతమైన సౌండ్‌తో సినిమాను సరికొత్తగా ఎంజాయ్ చేయవచ్చు.

​‘డూమ్స్‌డే’ ఎక్స్‌క్లూజివ్ లుక్ స్పెషల్ ఎట్రాక్షన్

​ఈ రీ-రిలీజ్ వెర్షన్‌లో అభిమానుల కోసం ఓ అదిరిపోయే సర్​ప్రైజ్ కూడా జోడించారు. మార్వెల్ నుంచి డిసెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ఈ ‘ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ ప్రదర్శనలలో చూపించనున్నారు. దీంతో ఈ రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

​థానోస్ విధ్వంసం వల్ల విశ్వంలో సగం జనాభా కనుమరుగైన నేపథ్యంలో, మిగిలిన సూపర్ హీరోలు ఏకమై తమ వారిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ‘ఎండ్‌గేమ్’ కథ. కెవిన్ ఫైజ్ నిర్మాణంలో ఆంథోనీ రస్సో, జో రస్సో ద్వయం ఈ భారీ విజువల్ వండర్‌ను తెరకెక్కించారు. ఈ ఐకానిక్ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Exit mobile version