
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ నటిస్తున్న తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆగస్ట్ 20న విడుదల కానుందని సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ ‘పంజా’, అల్లు అర్జున్ ‘హ్యాపీ’ చిత్రాలకు యువన్ సూపర్ హిట్ ఆడియో అందించాడు. రామ్ చరణ్ చిత్రానికి సంగీతం అందించడం మాత్రం ఇదే తొలిసారి. కృష్ణవంశితో కలసి పనిచేయడం కూడా ఇదే తొలిసారి. కుటుంబ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అద్బుతమైన బాణిలను అందించాడట.
‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22 కంటే రెండు రోజుల ముందు విడుదల చేయడానికి ఒక కారణం ఉందని అంటున్నారు. ఆగస్ట్ 22న చిరు 150వ చిత్రం విశేషాలను ప్రకటిస్తామని ఎప్పటినుండో చెప్తున్నారు. అందుకే ‘గోవిందుడి’ ఆడియో ఆగస్ట్ 20న విడుదల చేయనున్నారని సమాచారం. చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగాస్టార్ బర్త్ డే వేడుకలకు రెండు రోజుల ముందే అభిమానులకు పండగ తీసుకురావడానికి సిద్దమయ్యారు.
పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమలిని ముఖర్జీని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ జూలై 28న కృష్ణవంశి పుట్టినరోజున విడుదల చేయనున్నారు.

