
హుదూద్ బాధితులకు చేయూతనివ్వడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’. ఈ వేడుక నవంబర్ 30న హైదరబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ స్టార్ నైట్ ఈవెంట్ ని భారీ ఎత్తున చేయడం కోసం చిత్ర పరిశ్రమ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. సుమారు 13 గంటల పాటు కంటిన్యూగా లైవ్ లో జరిగే ఈ లైవ్ టెలీథాన్ లో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.
ఆ రోజు స్టేజ్ పై పెర్ఫార్మన్స్ చేసే వారి లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. వీరిద్దరూ చేసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి సంబంధించిన డిజైన్ మరియు ప్రోగ్రాం స్క్రిప్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు లైవ్ లో స్టేజ్ పైన ఒక పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది ఇది వరకూ జరగలేదు. దాంతో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ మేము సైతం అనే ఈవెంట్ న భూతో న భవిష్యత్ అనేలా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకి ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రముఖులు రానున్నారు. అలాగే తెలుగు పరిశ్రమలోని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, డైరెక్టర్, కమెడియన్ ఇతరులు ఈ వేడుకకి హాజరు కానున్నారు.

