
గత రెండు వారాల నుండి.. విశాఖ హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ చేపట్టిన ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్ టెలీథాన్ సంబంధించి వార్తలను ఎప్పటికప్పుడు 123తెలుగు.కామ్ పాఠకుల అందిస్తూ వచ్చాం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై టెలీథాన్ అర్ధరాత్రి 11 వరకు సాగింది. ప్రేక్షకులను అలరిస్తూ ఘనవిజయం సాధించింది.
స్టార్ హీరోల ప్రదర్శనలు, కబడ్డీ, స్టార్ క్రికెట్ మ్యాచ్ లు మరియు వినోదభరితమైన అంతాక్షరి కార్యక్రమం ముగిసే వరకూ కొనసాగాయి. ఈ మెగా ఈవెంట్ లో కబడ్డీ మ్యాచ్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. అఖిల్ సారథ్యంలోని నాగార్జున టీం స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందింది. కార్యక్రమం ముగిసే సమయానికి 11,51,56,116/- రూపాయల విరాళాలు సమకూరాయి. ముఖ్య అతిధికి హాజరయిన ఎపి సియం నారా చంద్ర బాబు నాయుడుకు చెక్ రూపంలో అందజేశారు. చివరగా, రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు మేమున్నాం అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్క తాటిపై నిలిచి సహాయం చేయడానికి ముందుకు వస్తాం అని నిరూపించారు.

