
2015లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం సినిమా తప్పకుండా ఉంటుందని ‘మేము సైతం’ కార్యక్రమం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పారు. గతంలో వీరిద్దరి కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు రూపొందాయి. ‘అతడు’ సినిమా మహేష్ బాబు సినీ జీవితంలో మైలురాయిగా నిలిస్తే, ‘ఖలేజా’ సినిమా సూపర్ స్టార్లో మరో కోణాన్ని(కామెడీ యాంగిల్) ఆవిష్కరించాయి. వీరిద్దరి కలయికలో రూపొందనున్న ఈ హాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక వచ్చే ఏడాది నెరవేరనుంది.
ఒక దర్శకుడితో మహేష్ బాబు మూడో సినిమా చేయడం ఇది రెండోసారి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలలో మహేష్ నటించాడు. ‘ఒక్కడు’ సినిమా మహేష్ ను సూపర్ స్టార్ చేస్తే, ‘అర్జున్’ విజయవంతమైన సినిమాగా నిలిచింది. ‘సైనికుడు’ ఘోర పరాజయం సాధించినా మహేష్ నటుడిగా ఫెయిల్ అవ్వలేదు. ఆ సినిమాలో మహేష్ స్టైలింగ్, యాక్టింగ్ ట్రెండ్ సెట్ చేశాయి.

