
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ – స్వాతి జంటగా నటించిన ‘స్వామి రారా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నిఖిల్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అలాగే నిఖిల్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన స్వామి రారా సినిమా ద్వారా సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం స్వామి రారా తీసిన నిర్మాతలు ‘స్వామి రారా 2’ని తీస్తున్నారు. ఈ సినిమాకి మొదటి సినిమాకి అస్సలు సంబంధం ఉండదు. ఇది పూర్తిగా కొత్త కథాశంతో తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర టీం చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ పాటని ఈ రోజు నుంచి బ్యాంకాక్ లో షూట్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడే మరో రెండు పాటలను కూడా షూట్ చేయనున్నారు. ఈ మూడు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఎ ఎన్ బోస్ నిర్మిస్తున్నాడు. చక్రి చిగురుపతి నిర్మాత.

