
‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుధీర్ బాబు. కొద్ది రోజుల క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ వారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినిమాతో రానున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే.. తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సుధీర్ బాబు ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా పరిచయం కానున్నాడని ఇది వరకే తెలియజేశాం. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘బాఘీ’ సినిమాలో సుధీర్ బాబు నటించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం తెలుగులో సూపర్ హిట్ అయిన ‘వర్షం’ సినిమాకి ఇది రీమేక్. వర్షం సినిమాలో ప్రభాస్ కి గట్టి పోటీ ఇచ్చే విలన్ పాత్రలో గోపీచంద్ నటించాడు. ఇప్పుడు తెలుగులో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. బాఘీ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. త్వరలోనే సుధీర్ బాబు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి తెలుగులో హీరోగా ప్రేక్షకులను మెప్పించిన సుధీర్ బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాలీవుడ్ ని ఎంతవరకూ మెప్పిస్తాడనేది చూడాలి.
సుధీర్ బాబు – నందిత జంటగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. లగడపాటి శ్రీధర్ – శిరీషా కలిసి నటించిన ఈ సినిమా కన్నడ మూవీ చార్మినార్ కి రీమేక్.

