
సినిమాల్లో పవర్ స్టార్‌గా అశేష అభిమానాన్ని పొందుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ గత ఎన్నికల సమయంలో ‘జనసేన’ పేరుతో పవన్ ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు. అప్పట్నుంచే పలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల తరపున నిలబడుతూ వచ్చారు. ఇక ఈ ఉదయం పుష్కరాల వేడుకల్లో జరిగిన దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు.
పుష్కరాలలో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కాంక్షించారు. ఇక సంఘటనా స్థలానికి తానే స్వయంగా వెళ్ళి బాధిత కుటూంబాలను కలుసుకొని సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని భావించానని, అయితే సంఘటనా స్థలానికి తాను రావడం తోపులాటకు దారితీసి ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తుందన్న నేపథ్యంలో ఆయన తన ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. ప్రజాశ్రేయస్సే తనకు ప్రధానమని తెలిపిన పవన్, జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో భాగం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఈ ఉదయం ప్రారంభం కాగా, కోటగుమ్మం ఘాట్ వద్ద భారీ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సుమారు 27 మంది చనిపోయారు. ఇదే తోపులాటలో గాయాలపాలైన మరికొందరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

