
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమాలో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ బలమైన ఎమోషన్ చుట్టూనే సినిమాకు ఆత్మ అయిన బలమైన కథ ఉంటుంది. తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ అందించే అలాంటి కథలనే తన మార్క్ స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో మరచిపోలేని సినిమాలుగా తీర్చిదిద్దారు రాజమౌళి. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ ఏడాది ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కిన ‘భజరంగీ భైజాన్’ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడం విశేషం.
‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కబీర్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ల కాంబినేషన్లో రూపొందిన ‘భజరంగీ భైజాన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమాదవశాత్తు ఇండియాలో చిక్కుకుపోయిన ఓ పాకిస్థాన్‌కు చెందిన పాపను తన వాళ్ళకు అప్పగించే హీరో కథే ఈ సినిమా నేపథ్యం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు దర్శకుడితో కలిసి స్క్రీన్‌ప్లే కూడా రాశారు. విడుదలైన అన్ని చోట్ల నుంచీ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
బాలీవుడ్ మీడియా మొత్తం ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతోంది. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. గత వారం క్రితమే ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తా ప్రదర్శితమవ్వగా, ఓ తెలుగు రచయిత కథ ఈ వారం మళ్ళీ సంచలనంగా మారడం విశేషంగా కనిపిస్తోంది!

