
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్‌తో పాటు, థియేట్రికల్ ట్రైలర్, మూడు పాటలకు సంబంధించిన సాంగ్ ట్రైలర్స్ కూడా విడుదల చేశారు. వీటికి సంబంధించిన విజువల్స్ చూసిన వారంతా సినిమా రిలీజ్ రోజైన ఆగష్టు 7 దాకా ఆగలేరంటే అతిశయోక్తి కాదు.
ఇక కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్ ద్వారా హీరో ఊరిని దత్తత తీసుకోవడమనే నేపథ్యంలో శ్రీమంతుడు సినిమా నడుస్తుందనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ ద్వారా హీరో ఆలోచనా విధానాన్ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ‘ఇన్నేళ్ళుగా వాడు మాకే అర్థం కాలేదు. ఇంక ఆ అమ్మాయికి ఏం అర్థమవుతాడు’ అన్న జగపతి బాబు డైలాగ్‌తో మహేష్ ఈ సినిమాలో తాను కోరుకున్న బలమైన అంశం కోసమే తనదైన ప్రయాణాన్ని మొదలుపెట్టే వ్యక్తిగా కనిపిస్తాడని స్పష్టమవుతోంది.
ఇక హీరోయిన్ శృతి హాసన్ చెప్పే “మా ఊరు నాకు ఎంతో ఇచ్చింది. తిరిగివ్వకపోతే లావైపోతాను” అని చెప్పిన డైలాగ్‌నే మహేష్ చివర్లో విలన్లకు ఆపాదించి చెప్పడం చూస్తే.. సినిమాలో తాను చెప్పాలనుకుంటున్న అసలైన పాయింట్‌ను దర్శకుడు రివీల్ చేసేశారు. ఇక ఈ ట్రైలర్లో హైలైట్ అంశాల గురించి చెప్పుకోవాలంటే.. మహేష్ ఎప్పట్లానే తన మాంటేజ్ డైలాగులు, యాక్టింగ్‌తో కేక పుట్టించాడు. ఇక కొరటాల శివ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మధీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్, జగపతిబాబు స్టైలిష్ లుక్, డైలాగుల్లోని పంచ్‌లు విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘శ్రీమంతుడు’ సినిమాలో తాను చెప్పాలనుకుంటున్న పాయింట్‌ను ప్రెజెంట్ చేస్తూనే, మహేష్ మార్క్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయనే విషయాన్ని తెలిపేలా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ట్రైలర్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చివరగా, “ఏ ఎదవ పనిచేసినా ఆడ్ని కాపాడ్డానికి ఓ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడ్డానికి నాలాంటి బ్యాడ్ సన్ ఒకడున్నాడు. బ్యాడ్ అంటే.. నీలాక్కాదు.. అదోరకం” అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అభిమానులకు అన్నింటికన్నా కిక్కించే విషయం!
‘శ్రీమంతుడు’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

