‘లింగ’ తర్వాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. పిఏ రంజిత్ ఇచ్చిన కథకి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఇది వరకే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాధిక ఆప్టేని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. రక్తచరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, లెజెండ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ భామ రాధిక ఆప్టే ఓ కీలక పాత్ర కోసం ఎన్నిక చేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఏంటనేది చెప్పకపోయినా తన పాత్రే సినిమాకి కీలకం అని అంటున్నారు.
ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అది కూడా ఫస్ట్ షెడ్యూల్ ని మలేషియాలో మొదలు పెట్టనున్నారు. రజినీకాంత్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని, అంతే కాకుండా తన వయసుకు తగ్గా పాత్రలోనే ఆయన నటించనున్నారని సమాచారం. రజినీకాంత్ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించాడని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థను నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించనున్నాడు.


