
తెలుగులో కొన్ని అద్భుతమైన సినిమాలకు కథలను అందించి స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న వ్యక్తి బాలీవుడ్లో గత రెండు వారాలుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న రెండు సినిమాలు ఒకేవారం తేడాలో విడుదల కావడం, ఆ రెండు సినిమాలకూ కథ అందించింది ఒక్కరే కావడం, ఇక ఆ రెండు సినిమాలూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడం.. ఇంతకుమించి ఒక రచయిత కోరుకునేది ఏముంటుంది? ఆ రచయితే దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్ కాగా, ఆ సినిమాలే ‘బాహుబలి’, ‘భజరంగీ భైజాన్’.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అందరికీ తెలిసిందే. ఇక ‘భజరంగీ భైజాన్’ సినిమా విషయానికి వస్తే.. ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కబీర్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ల కాంబినేషన్లో రూపొందిన తాజా సంచలనమే ఈ ‘భజరంగీ భైజాన్’. అనుకోని సంఘటనతో ఇండియాలో చిక్కుకుపోయిన ఓ పాకిస్థాన్‌కు చెందిన పాపను, తిరిగి తన వాళ్ళకు అప్పగించే హీరో కథే ‘భజరంగీ భైజాన్’. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు దర్శకుడితో కలిసి స్క్రీన్‌ప్లే కూడా రాశారు.
ఇక గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకొని దూసుకుపోతోంది. తాను కథ అందించిన సినిమా ఈ స్థాయి మన్ననలు పొందడం పట్ల విజయేంద్రప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సల్మాన్ ఖాన్ తనకు ప్రత్యేకంగా కాల్ చేసి ప్రశంసించడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్ ఈ విషయాలను పంచుకున్నారు. సల్మాన్ తనను “ఈ సినిమాకు మీరే రియల్ హీరో” అనడం భావోద్వేగపరిచిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

