ఇంటర్వ్యూ : అనిల్ సుంకర – వచ్చే ఏడాది మహేష్‌తో ఓ సినిమా ఉంటుంది!

ఇంటర్వ్యూ : అనిల్ సుంకర – వచ్చే ఏడాది మహేష్‌తో ఓ సినిమా ఉంటుంది!

Published on Jul 23, 2015 1:26 PM IST

Anil-Sunkara
తెలుగులో పలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ’14 రీల్స్’ సంస్థలో ఓ నిర్మాతగా వ్యవహరిస్తూనే, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పలు ఇతర సినిమాలను కూడా నిర్మిస్తూ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ సుంకర. తాజాగా ఆయన అల్లరి నరేష్ హీరోగా, సాయి కిషోర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించిన సినిమా ‘జేమ్స్ బాండ్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకరతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘జేమ్స్ బాండ్’ సినిమా విశేషాలేంటి?

స) జేమ్స్ బాండ్ సినిమా మంచి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్. శ్రీను వైట్ల స్టైల్ జానర్ సినిమాగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఆసక్తికరమైన కథ, హీరో-హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ వంటివి అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందించాం. కామెడీ, అల్లరి నరేష్ మార్క్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో పాటు అందరూ చక్కగా చూడదగ్గ సినిమా జేమ్స్ బాండ్.

ప్రశ్న) ఈ బ్యానర్‌లో వరుసగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక కారణమా?

స) ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. కొత్త దర్శకులైతే ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తారు. మొదటి సినిమా అనే ఆలోచనలో కొత్త దర్శకులు ఎప్పుడూ కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలోనే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. కొత్త వాళ్ళను పరిచయం చేశామన్న సంతృప్తి కూడా ఉంటుంది.

ప్రశ్న) జేమ్స్ బాండ్ దర్శకుడు సాయి కిషోర్ గురించి చెప్పండి?

స) సాయి కిషోర్ నాకు చాలా కాలం నుంచి పరిచయం. నేను ఎవరితోనైనా సినిమా చేయాలంటే ముందుగా నాకు వాళ్ళ వ్యక్తిత్వం నచ్చాలి. మనం అవతలి వ్యక్తితో కనెక్ట్ అయినప్పుడే కదా వాళ్ళతో కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టగలిగేది! సాయి చాలా మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి. అతడు కథ చెప్పగానే కొత్తగా ఉందనిపించింది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమయ్యాక ఈ కథపై మంచి నమ్మకం వచ్చింది. నాకు చెప్పిన దానికంటే బాగా తీశాడని సినిమా చూశాక అనిపించింది.

ప్రశ్న) ఈ సినిమాను అల్లరి నరేష్ గారితోనే కారణం?

స) నాకైతే ఈ కథ వినగానే అల్లరి నరేషే గుర్తొచ్చారు. ఆయనను తప్ప ఈ క్యారెక్టర్‌కు మరొకరిని ఊహించుకోలేం. నరేష్‌కిది టైలర్ మేడ్ క్యారెక్టర్. మేము ఈ కథ వినిపించిన వెంటనే ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. సినిమా చూశాక అందరిలానే ఆయన కూడా చాలా సంతోషించారు.

ప్రశ్న) హీరోయిన్ పాత్రకు మొదట అనుష్కను సంప్రదించారట. నిజమేనా?

స) నిజమే. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పారు. నయనతారను కూడా సంప్రదించినా అప్పటికి ఆమె సినిమాలు చేయట్లేదని చెప్పారు. దీంతో చాలా రోజులు వెతికాక ఈ పాత్రకు సరైన నటిని సెలెక్ట్ చేశాం. సాక్షి చౌదరి డాన్ తరహా పాత్రకు సరిగ్గా సరిపోయింది.

ప్రశ్న) ‘బాహుబలి’ సినిమా రికార్డు సృష్టిస్తున్న సమయంలో వస్తున్నారు. రిస్క్ అనిపించలేదా?

స) లేదు. చెప్పాలంటే ఇదే మా సినిమాకు సరైన టైమ్ అని మేమంతా భావించాం. మరో రెండు వారాల తర్వాత ‘శ్రీమంతుడు’ వస్తుంది. ఆ తర్వాత ‘కిక్ 2’, ‘రుద్రమదేవి’ ఇలా వరుస సినిమాలు సిద్ధమవడంతో అప్పుడు ఇంకా అసలైన సమస్యలొస్తాయ్! ప్రస్తుతానికి బాహుబలి చూసిన వారికి ఈ మధ్యే రిలీజ్ అయిన సినిమా మరొకటి లేదు. ఆ రకంగా కూడా జేమ్స్ బాండ్‌కి అనుకూలత ఉంది. బాహుబలి చూసిన వారిలో 10-20% మా సినిమా చూసినా మాకు సంతోషమే కదా!

ప్రశ్న) తరువాతి ప్రాజెక్టులు ఏంటి?

స) 14 రీల్స్‌లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్నాం. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది నహేష్ బాబుతో కూడా ఓ సినిమా ఉంటుంది.

తాజా వార్తలు