
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’ సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చిన యంగ్ హీరో నితిన్ ‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. ఈ గ్యాప్ లో నితిన్ నిర్మాతగా ఆఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి దశకి రావడంతో నితిన్ త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. కానీ చిన్నదానా నీకోసం సినిమా తర్వాత వచ్చిన గ్యాప్ ని అప్పుడెప్పుడో ఆగిపోయిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాతో భర్తీ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు.
నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అయ్యింది. కానీ ఫైనాన్సియల్ సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ విషయంలో వాయిదా పడుతూ వస్తుంది. కానీ అన్ని సమస్యలను పరిష్కరించి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. అందులో భాగంగానే మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రేమ్ సాయి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

