శ్రీమంతుడిని ప్రశంసించిన కేంద్ర మంత్రి!

శ్రీమంతుడిని ప్రశంసించిన కేంద్ర మంత్రి!

Published on Aug 12, 2015 2:22 PM IST

srimanthudu-venkaiah
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఊరు గొప్పదనాన్ని, ఊర్లలో ఉన్న సహజ వనరులు ఎలా దోపిడీకి గురవుతున్నాయన్నది కమర్షియల్ అంశాలతో జోడించి రూపొందించారు. ఈ ప్రయత్నానికి అన్ని వర్గాలనుండీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కానెప్ట్ అయిన ఊరిని దత్తత తీసుకోవడమనే అంశం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కనిపించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో నిన్న సాయంత్రం పలువురు ఎంపీలకు ఓ స్పెషల్ షో వేశారు. మహేష్ బావ అయిన గల్లా జయదేవతో ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ షోకు పలువురు ఎంపీలు హాజరయ్యారు. ఈ షో చూసిన రాజకీయ ప్రముఖులు కూడా మంచి కాన్సెప్ట్‌ను చెప్పినందుకు అభినందించారని తెలుస్తోంది.

ఇక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ‘శ్రీమంతుడు’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఏ మాత్రం అసభ్యతకు, అశ్లీలతకు తావివ్వకుండా ఒక మంచి సినిమాను వినోదభరితంగా చెప్పిన విధానం నచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సినిమాల్లో సోషల్ మెసేజ్ అంశాలను చెప్పడం ద్వారా విజ్ఞానాన్నీ పంచినట్లు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరముందని ఆయన ఈ సందర్భంగా కాంక్షించారు. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు మహేష్ సహ నిర్మాతగానూ వ్యవహరించిన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు