
దేవా కట్టా.. తెలుగు సినీ పరిశ్రమలో ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శక రచయిత. ఓ బలమైన కథాంశం చుట్టూ అంతే బలమైన ఎమోషన్‌ను జోడించి సినిమాలు తీసే దేవాకట్టా, ప్రస్తుతం ‘డైనమైట్’ అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. అదలా ఉంచితే తన సినిమాల ద్వారా ఏదైనా బలమైన మెసేజ్‌ను కూడా చెప్పాలన్న ఆలోచన చేస్తూ ఉండే దేవా కట్టా, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మంచి మెసేజ్ ఓరియంటడ్ అంశంతో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.
‘డైయింగ్ టు బి మీ’ అనే టైటిల్‌తో దేవా కట్టా రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 69 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓ సాధారణ మహిళ ఆర్థికంగా స్వయంగా ఏ స్థాయిలో నిలబడి ఉందనే అంశంపై తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచింపజేసేలా ఉంది. విజువల్స్ కూడా మూడ్‌ను సరిగ్గా క్యాప్చర్ చేయగలిగాయి. డైలాగ్స్ కూడా చాలా సింపుల్‌గా, షార్ప్‌గా ఉన్నాయి. నాలా నేను ఉండడానికి కష్టపడాల్సి వస్తుంది అన్న అర్థం వచ్చేలా రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్న సమాజంలో మహిళకు ఏ స్థాయి స్వతంత్రత ఉందన్న అంశాన్ని బలంగా చూపింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో సింగర్ స్మిత, రవివర్మలు నటించారు.
షార్ట్ ఫిల్మ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

