
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా 40 రోజుల్లోపే షూటింగ్ పూర్తి చేసుకొని విశేషంగా కనిపించింది. కమల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా రాజేష్.ఎమ్. సెల్వ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కిందన్న వార్తతో ఆసక్తికరంగా మారిన ఈ సినిమా తాజా అప్‌డేట్‌లతో మరింత ఆసక్తికరంగా మారింది.
‘చీకటి రాజ్యం’లో ఓ ఇంటరెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ అందరినీ విపరీతంగా కట్టిపడేస్తుందని సమాచారం. ఒక రెస్టారెంట్‌లోని కిచెన్‌లో జరిగే ఈ ఫైట్‌లో త్రిష, కమల్‌ల మధ్యన ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ఫ్రెంచ్ స్టంట్‌మ్యాన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉంటుందని, అందరినీ ఆకట్టుకుంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో త్వరలోనే జరగనుందని, రిలీజ్ కూడా అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమా తూంగవనం పేరుతో రూపొందుతోంది.

