
మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో సూపర్ హిట్ కొడితే చూడాలన్న ఆశ ‘శ్రీమంతుడు’తో తీరిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 7న విడుదలై ఇప్పటివరకూ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తూ దూసుకుపోతోన్న ఈ సినిమాపై ఇటు సినీ ప్రేక్షకులు అభిమానులే కాక, పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఊరిని దత్తత తీసుకోవడమనే బలమైన సోషల్ మెసేజ్ ఉన్న కథాంశాన్ని కమర్షియల్‌గా చెప్పిన విధానానికి అంతటా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక తమ సినిమా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల మహేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కెరీర్లో శ్రీమంతుడు ఓ మరచిపోలేని సినిమాగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపైనే మహేష్ మాట్లాడుతూ.. “అతడు సినిమా విడుదలై దాదాపుగా పదేళ్ళయింది. ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వస్తే అలా చూస్తూ ఉండిపోతాం. ‘శ్రీమంతుడు’ కూడా అలాంటి సినిమానే! ఇంకో ఇరవై ఏళ్ళయినా కూడా ఈ సినిమా అదే ఇంపాక్ట్ ఇస్తుంది. కొరటాల శివ గారు ప్రతీ విషయంలోనూ చూపిన డీటైలింగ్ కూడా ఈ సినిమాను ఎప్పటికీ నిలబెడుతుంది” అని తెలిపారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

