
సూపర్ స్టార్ మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే దాని రేంజ్ ఎలా ఉంటుందనేది గతంలో చాలా సినిమాలు చూపించాయి. ఇప్పుడు తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమా ఆ లిస్ట్‌లో కొత్తగా వచ్చి చేరింది. ఆగష్టు 7న మహేష్ పుట్టిన రోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు మొదలైన శ్రీమంతుడు సినిమా పండగ అభిమానులకు సంబరాన్ని తెచ్చిపెట్టింది. విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ళ పరంగానే కాక, విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకుంది. ముఖ్యంగా ఒక సోషల్ మెసేజ్‌తో ముడిపడి ఉన్న కథనాన్ని దర్శకుడు కొరటాల శివ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చెప్పిన విధానానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తమ సినిమాకు ఈ స్థాయి విజయం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు, అభిమానులకు థ్యాంక్స్ తెలిపేందుకు శ్రీమంతుడు యూనిట్ హైద్రాబాద్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మరికాసేపట్లో శిల్పకళావేదికలో ఈ థ్యాంక్స్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి మహేష్‌తో పాటు, దర్శకుడు కొరటాల శివ, మిగతా యూనిట్ సభ్యులు కూడా హాజరుకానున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు మహేష్ సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఇక మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

