
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న మహేష్ బర్త్‌డేకి రెండు రోజుల ముందే మొదలైన ఈ సినిమా పండగ నేటికీ అదే రేంజ్‌లో కొనసాగుతూ వస్తోంది. విడుదలైన నాటి నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఈ సినిమా, కలెక్షన్ల పరంగానే కాక, విమర్శకుల ప్రశంసల పరంగానూ శ్రీమంతుడు అనిపించుకుంది. ఊరిని దత్తత తీసుకోవడమనే ఓ సోషల్ మెసేజ్ ముడిపడి ఉన్న కథాంశాన్ని కమర్షియల్‌గా చెప్పిన విధానానికి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక తమ సినిమాకు ఈ స్థాయి విజయాన్ని చేకూర్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలన్న ఆలోచనతో శ్రీమంతుడు టీం నిన్న హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున థ్యాంక్యూ మీట్‌ను ఏర్పాటు చేసింది. శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకకు ఎంపీ గల్లా జయధేవ్, కే.ఎస్.రామారావు అతిథులుగా హాజరు కాగా, సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, సంపత్ రాజ్‌లతో పాటు నిర్మాతలు నవీన్, రవి శంకర్, చీవీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు షీల్డ్స్ అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సినిమాకు ఈ స్థాయి విజయాన్ని చేకూర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ థ్యాంక్స్ మీట్‌లో మహేష్ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడం విశేషంగా కనిపించింది.
మహేష్ మాట్లాడుతూ.. “సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు రెండో హీరో అంటే దేవిశ్రీయే! ఇంతపెద్ద విజయాన్ని సమకూర్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రెండు వారాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈమధ్యే కాకినాడకు చెందిన అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ అబ్బాయి, ‘శ్రీమంతుడు’ సినిమా చూశాక నన్ను కలవాలనుకున్నాడు. నేను వెళ్ళి అతణ్ణి కలిశాక ‘శ్రీమంతుడు చూశా.. ఇట్స్ మార్వెలెస్’ అన్నాడు. ఆ కాంప్లిమెంట్ నా జీవితంలో ది బెస్ట్. అభిమానుల అలరించేందుకు ఎప్పుడూ మంచి సినిమాలు చేస్తూనే ఉంటా” అని తెలిపారు.

