
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తోన్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. గత కొద్దికాలంగా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్, మళ్ళీ తన కొత్త సినిమాను లైన్లో పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పేరుతో రూపొందుతోన్న ఈ కొత్త సినిమాకు ‘పవర్’ సినిమా ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఓ పక్క రాజకీయ పరమైన కార్యక్రమాలను చూసుకుంటూనే, సర్దార్ గబ్బర్ సింగ్‌ను పూర్తి చేసేస్తున్నారు పవన్. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెట్స్‌పైకి వెళ్ళకముందునుంచే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండగా, ఇప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్ళడం, శరవేగంగా షూటింగ్ జరుపుకోవడం చూశాక ఈ సినిమాపై ఉన్న క్రేజ్ రెట్టింపైంది. అందుకు తగ్గట్టుగానే అప్పుడే బిజినెస్ వ్యవహ్యారాలు కూడా మొదలవ్వడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే పెద్ద మొత్తాలతో సిద్ధమయ్యారని సమాచారం. సినిమా ఇంకా సగం కూడా పూర్తి కాకముందే ఇలా ఉంటే, ఆ తర్వాత ఇంకెలా ఉంటుందని ట్రేడ్ టాక్. పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

