
నటుడిగా, నిర్మాతగా పలు విజయవంతమైన డిఫరెంట్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న మంచు విష్ణు, తాజాగా ‘డైనమైట్’ సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ఇంటెన్స్ కథాంశాలను తనదైన బాణీలో తీస్తాడన్న పేరు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ‘డైనమైట్’ సినిమా, రేపు (సెప్టెంబర్ 6) ప్రప్రంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌పై అంతటా మంచి అంచనాలే ఉండడంతో, విష్ణు కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌గా ఈ సినిమా విడుదలవుతోంది.
ఇక సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందే అంటే ఈ సాయంత్రం హైద్రాబాద్‌తో పాటు, తిరుపతిలో కూడా డైనమైట్ స్పెషల్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు. హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌కు సినిమా యూనిట్‌తో పాటు మంచు ఫ్యామిలీ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి ప్రీమియర్ షోకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరు కానున్నారు. విష్ణు సరసన ప్రణీత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్‌గా నటించారు. జాకీచాన్ స్టైల్ ఫైట్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది.

