
1970లలోనే ఎవ్వరూ ఊహించని కథలతో సౌత్ లో భారీ ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వచ్చిన ‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ లాంటి ఎన్నో విభిన్న తరహా సినిమాలు ఇప్పటి దర్శకులకు గైడ్ లాంటివి. ఈ మధ్య కాలంలో దర్శకుడిగా సినిమాలు తగ్గించిన ఆయన అడపాదడపా సినిమాలో నటుడిగా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ‘వరుడు’, ‘చిన్ని చిన్ని ఆశ’ సినిమాలలో కనిపించిన ఈ లెజండ్రీ డైరెక్టర్ మరో తెలుగు సినిమాలో కనిపించనున్నాడు. అదే టాలీవుడ్ మునుపెన్నడూ రాని కాన్సెప్ట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక మూవీ ‘కంచె’.
మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా రొటీన్ అనే పదానికి చాలా దూరంగా వెళ్లి డిఫరెంట్ కథలతో సినిమాలు చేసే క్రిష్ దర్శకత్వం వహించిన కంచె సినిమాలో సింగీతం శ్రీనివాసరావు ఓ ముఖ్యమైన పాత్రని పోషించాడు. 1947 బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో ఓ పాత్రకి ఆయనైతేనే పర్ఫెక్ట్ అని సింగీతంని ఎంచుకున్నట్లు సమాచారం. లెజండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ తెలిపాడు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. అలాగే సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

