
తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న నటి త్రిష. తన పదమూడేళ్ళ కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన త్రిష, మొదటిసారిగా ‘నాయకి’ అంటూ ఓ హర్రర్ కామెడీతో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ నిర్మాతగా, రాజ్ కందుకూరి సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ‘నాయకి’ రూపొందుతోంది. గోవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ మధ్యే చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ హైద్రాబాద్‌లో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలను తెలియజేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష, హీరో గణేష్ వెంకట్రామన్, దర్శకుడు గోవి, నిర్మాత గిరిధర్, సహ నిర్మాత రాజ్ కందుకూరిలతో పాటు సినిమాలో కీలక పాత్రల్లో నటించిన మాధవి లత, సుష్మ రాజ్, సత్య రాజేష్, జేవీ, జయ ప్రకాష్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టైటిల్ రోల్ పోషిస్తోన్న హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని ఓ సరికొత్త పాత్రను ‘నాయకి’లో చేశా. ఈ సినిమా నా కెరీర్‌కి ప్రత్యేకంగా నిలిచే సినిమా. గిరిధర్ నా డేట్స్‌ను గత ఎనిమిదేళ్ళుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గోవి మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌లో ఓ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అని తెలిపారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హీరో గణేష్ వెంకట్రామన్ మాట్లాడుతూ.. త్రిషతో కలిసి చేసిన ‘ఆకాశమంత’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన తనకు, నాయకి మరో ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు గోవి మాట్లాడుతూ.. త్రిషతో సినిమా చేయడం తన కలని, నాయకితో తన కల నెరవేరుతోందని తెలిపారు. నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ.. అన్ని విధాలా ఓ మంచి హర్రర్ కామెడీ సినిమాను అందించేందుకు కృషి చేస్తున్నామని, ఫస్ట్ షెడ్యూల్ బాగా వచ్చిందని, సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటులు సత్యం రాజేష్, జేపీ, మాధవి లత, సుష్మా రాజ్ తదితరులు మాట్లాడుతూ ఈ సినిమాలో భాగం కావడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు.

