
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో ‘పంజా’ అనే ఓ స్టైలిష్ సినిమా చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణు వర్ధన్, తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తమిళంలో ‘బిల్లా’, ‘ఆరంభం’ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణు వర్ధన్, తాజాగా ‘యాట్చన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఆర్య హీరోగా రూపొందిన ఈ సినిమా రేపు తమిళనాట పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సందర్భంగా పత్రికలతో ముచ్చటిస్తూ, విష్ణు వర్ధన్ ‘పంజా’ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు.
తెలుగులో తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘పంజా’ కొంతమందికి బాగా నచ్చగా, మరి కొంతమందికి మాత్రం నచ్చలేదని తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ, కలిసినప్పుడల్లా ‘పంజా’ సినిమాను మెచ్చుకుంటారని తెలిపారు. “పవన్ కళ్యాణ్ ఓ గొప్ప మనిషి. ఆయనతో డబుల్ గేమ్ లాంటిది ఆడాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాదు. ఆయన ఎంత నిజాయితీగా ఉంటారో మనమూ అంతే నిజాయితీగా ఉండాలని అనిపించేలా ప్రవర్తిస్తారు. పవన్ లాంటి వారిని చాలా అరుదుగా చూస్తూంటాం. ఆయనతో కలిసి సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభూతి” అంటూ దర్శకుడు విష్ణు వర్ధన్ పవన్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

