
దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ మీనన్, నిర్మాతగా తెలుగులో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ పేరుతో మన ముందుకు రానున్నారు. వరుస హిట్లతో జోరు మీదున్న నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన గౌతమ్ మీనన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.. ప్రేక్షకులను, మిమ్మల్ని ఎంతగానో ఎదురుచూయించిన ఈ సినిమా ఈవారం విడుదలకు సిద్ధమైంది. సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం?
స) ద్విభాషా చిత్రాలన్నింటికీ ఈ సమస్యలు వస్తూంటాయేమో! ఈ సినిమా దాదాపుగా పూర్తయ్యే సమయానికి తమిళ వర్షన్‌కు కొంత ఫండింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ సమస్యలాన్నీ తీరిపోయాక, మిగిలిన పోర్షన్ షూట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం, ఇంకా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్.. ఇలా అన్నీ ఎదురయ్యాయి. దీంతో సినిమా అనుకోకుండానే లేట్ అయింది. ఏదేమైనా చివరికి ఓ మంచి అవుట్‌పుట్ వచ్చింది. మరో 5రోజుల్లో సినిమా కూడా విడుదలవ్వబోతోంది. సో.. చాలా హ్యాపీ!
ప్రశ్న) సినిమా లేట్ అవ్వడం వల్ల ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’కి మొదట్లో కనిపించిన క్రేజ్ ఏమైనా తగ్గిందని అనుకుంటున్నారా?
స) అలాంటిదేమీ లేదు. ఈ సినిమా విడుదల ఆలస్యమైనా కూడా, ఫీల్ ఇప్పటికీ చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఎక్కడా ఓల్డ్ లుక్ అనేది ఉండదు. ఇక సినిమాకున్న క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదనే అనుకుంటున్నా. ఈ మధ్యే విడుదలైన ఆడియోకు, కొత్త ట్రైలర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నేనైతే ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంతో ఉన్నా.
ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే సినిమా ఎలా మొదలైంది?
స) కొత్త దర్శకులు, కొత్త రచయితలతో పనిచేయాలని నాకెప్పుడూ ఉంటుంది. కొత్తగా ఎవరు కథ చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉంటా. ఈ క్రమంలోనే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కథతో దర్శకుడు ప్రేమ్ సాయి నన్ను కలిసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. చాలా కొత్తగా అనిపించిందీ కథ. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా దీన్ని రూపొందించాలాని ఫిక్స్ అయ్యా. ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని గురు ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మించా.
ప్రశ్న) దర్శకుడు ప్రేమ్ సాయి చెప్పిన కథలో మిమ్మల్ని అంతగా ఎగ్జైట్ చేసిన అంశమేంటి?
స) ముందే చెప్పినట్లు, ఇదో కొత్త కథ. నెరేషన్ కూడా అంతే కొత్తగా అనిపించింది. ఒక మంచి ఎలిమెంట్, లవ్, యాక్షన్.. ఇలా ఈ సినిమాలో చాలా కోణాలున్నాయి. ఈ కథ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగిన వెంటనే సినిమాను నిర్మించాలని ఫిక్సయ్యా. ప్రేమ్ సాయి కథ చెప్పినప్పుడు ఎంతగా ఇంప్రెస్ చేశాడో, దాన్ని సినిమాగా మలచడంలోనూ అదే స్థాయి ప్రతిభ కనబరిచాడు.
ప్రశ్న) హీరో నితిన్ గురించి చెప్పండి? సినిమా లేట్ అవ్వడం విషయంలో ఆయన ఎలా స్పందించారు?
స) నితిన్ చాలా ఎనర్జీ ఉన్న హీరో. ఈ కథ ఓకే అవ్వగానే తెలుగులో నితిన్‌కే ఈ సినిమా సెట్ అవుతుందని భావించాం. యూత్ నితిన్ క్యారెక్టర్లో తమను తాము చూసుకుంటారని కచ్చితంగా చెప్పగలను. స్వతహాగా నిర్మాత కూడా అయిన నితిన్, ఈ సినిమా విషయంలో తలెత్తిన ఇబ్బందులన్నింటినీ అర్థం చేసుకొని అండగా నిలబడ్డాడు. ఇక నన్నడిగితే నితిన్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్తా.
ప్రశ్న) హీరోయిన్ యామి గౌతమ్ గురించి చెప్పండి?
స) ప్రేమ్ సాయి ఈ సినిమా కోసం చాలా ప్రొఫైల్స్ పరిశీలించారు. చివరగా యామి గౌతమ్‌ను సెలెక్ట్ చేశారు. యామి గౌతమ్ తన పాత్రను చాలా బాగా పోషించింది. ఈ సినిమాకు ఆమె సరిగ్గా సరిపోయింది. నితిన్, యామిల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా అందంగా ఉంటాయి.
ప్రశ్న) మొదటిసారి తెలుగులో నిర్మాతగా ఓ సినిమా చేశారు. ఎలా అనిపించింది?
స) బాగుంది. తెలుగు సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కొత్త కాబట్టి మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడంతా బాగుంది. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
ప్రశ్న) భవిష్యత్‌లో కూడా ఇదే కోవలో తెలుగులో సినిమాలు నిర్మిస్తారా?
స) కచ్చితంగా. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకం కలిగింది. మున్ముందు సరికొత్త కథలతో తెలుగులో సినిమాలు నిర్మించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా.
తన దర్శకత్వంలో రూపొందిన సినిమాల విశేషాలు, ప్రస్తుతం సినిమా నిర్మాణం ఎలా ఉంది? అన్న అంశాలపై గౌతమ్ మీనన్ చెప్పిన విశేషాలను ఈ ఇంటర్వ్యూకు కొనసాగింపైన పార్ట్ 2లో చదవండి.

