
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు ‘ఇంటర్నేషనల్ కట్’తో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చే క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఉన్నారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’కి ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించే ఆలోచన చేశారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను ఎడిట్ చేయించారు. ఇక ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శన అలా ఉంచితే.. ఇంటర్నేషనల్ వర్షన్ థియేట్రికల్ రిలీజ్ మొదటగా చైనాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్స్ ఫిస్ అనే సంస్థ బాహుబలి సినిమాను చైనాలో సుమారు 5000 థియేట్ర్లలో పెద్ద ఎత్తున విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ సంస్థ గతంలో ‘పీకే’ సినిమాను చైనాలో విడుదల చేసి ఇండియన్ సినిమాకు చైనాలో వందకోట్ల క్లబ్‌ను సాధ్యం చేసింది.

